DC VS RR | శాంస‌న్ పోరాటం వృథా.. ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ

DC vs RR :  ప‌దిహేడో సీజ‌న్ ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌.. ప్ర‌త్య‌ర్థి ఏమో టేబుల్ టాప‌ర్ల‌లో ఒక‌టైన రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals). కానీ, రిష‌భ్ పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals) ఏమాత్రం అద‌ర‌లేదు బెద‌ర‌లేదు. తొలుత ఓపెన‌ర్లు అభిషేక్ పొరెల్(65), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(50) విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టిన ఢిల్లీ.. అనంత‌రం బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద‌రగొట్టింది.. సంజూ శాంస‌న్(86) ఒంట‌రి పోరాటం చేసినా ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో పంత్ సేన పైచేయి సాధించింది. 20 పరుగుల తేడాతో రాజ‌స్థాన్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ ఆశ‌ల్నీ స‌జీవంగా ఉంచుకుంది.

నిల‌క‌డ‌లేమికి కేరాఫ్ అయిన‌ ఢిల్లీ కీల‌క పోరులో పంజా విసిరింది. రాజస్థాన్ రాయ‌ల్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. 222 ఛేద‌న‌లో ఓపెన‌ర్లు జోస్ బ‌ట్ల‌ర్(19) య‌శ‌స్వీ జైస్వాల్(4)లు విఫ‌ల‌మైనా కెప్టెన్ సంజూ శాంస‌న్(86) ప‌ట్టువ‌ద‌ల‌కుడా పోరాడాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో ఫిఫ్టీ బాదేశాడు.

నాలుగో వికెట్‌కు 59 ర‌న్స్

అయితే.. ర‌సిక్‌ద‌ర్ స‌లామ్సూప‌ర్ బాల్‌తో రియ‌న్ ప‌రాగ్(27)ను బౌల్డ్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. శుభ‌మ్ దూబే(25)తో క‌లిసి జ‌ట్టు స్కోర్ 150 దాటించాడు. నాలుగో వికెట్‌కు 59 ర‌న్స్ జోడించి. ఢిల్లీ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకుంటున్న శాంస‌న్‌ను ముకేశ్ పెవిలియ‌న్ పంపాడు. బౌండ‌రీ రోప్ వ‌ద్ద హోప్ అద్భుత క్యాచ్ ప‌ట్ట‌డంతో శాంస‌న్ నిరాశ‌గా డౌగౌట్‌కు చేరాడు. అప్ప‌టికీ రాజ‌స్థాన్ విజ‌యానికి 26 బంతుల్లో 60 ర‌న్స్ కావాలి.

రెండేసిన కుల్దీప్

శాంస‌న్ త‌ర్వాత వ‌చ్చిన రొవ్‌మ‌న్ పావెల్(13) వ‌రుస‌గా రెండు బౌండ‌రీలు బాదాడు. ఆ త‌ర్వాత ఖలీల్ అహ్మ‌ద్ ఓవ‌ర్లో దూబే సైతం సిక్స‌ర్‌, ఫోర్ బాదాడు. అంతే ఢిల్లీ శిబిరంలో పెరిగిన‌ ఆందోళ‌న‌. కానీ, ఖలీల్ వేసిన షార్ట్ బాల్‌ను అంచ‌నా వేయ‌లేక స్ట‌బ్స్‌కు దొరికాడు. ఆ కాసేప‌టికే కుల్దీప్ ఒకే ఓవ‌ర్లో తొలి మ్యాచ్ కుర్రాడు డొనొవాన్ ఫెరారియా(1), అశ్విన్‌(2)ను వెన‌క్కి పంపి రాజ‌స్ఠాన్‌ను మ‌రింత ఒత్తిడిలోకి నెట్టాడు. ముకేశ్ కుమార్ వేసిన 20వ‌ ఓవ‌ర్లో విజ‌యానికి ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. తొలి బంతికి బౌల్ట్ సింగిల్ తీశాడు. ఆ త‌ర్వాత బంతికి పావెల్ బౌల్డ్ అయ్యాడు. అంతే.. ఢిల్లీ విజ‌యం ఖాయమైపోయింది. 20 ప‌రుగుల తేడాతో గెలిచిన పంత్ బృందం ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.

ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు మిణుకుమిణుకుమంటున్న వేళ‌ ఢిల్లీ ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. అభిషేక్ పొరెల్(65), జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(50)లు రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తూ హాఫ్ సెంచ‌రీ బాదారు. 60 ర‌న్స్ వ‌ద్ద తొలి వికెట్ ప‌డిన ఢిల్లీని పొరెల్ అర్ద సెంచ‌రీతో ఆదుకున్నాడు. కెప్టెన్ రిష‌భ్ పంత్(15)తో క‌లిసి ఇన్నింగ్స్ నిర్మించాడు.

ఇక‌.. ఆఖ‌ర్లో కుర్రాడు ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(41) వీర‌విహారం చేశాడు. చాహ‌ల్ వేసిన 18వ‌ ఓవ‌ర్లో స్వీప్ షాట్ల‌తో మూడు ఫోర్లు, ఆఖ‌రి బంతికి సిక్స‌ర్ బాది 21 ర‌న్స్ పిండుకున్నాడు. గుల్బ‌దిన్‌(19)తో క‌లిసి 45 ర‌న్స్ జోడించారు. సందీప్ వేసిన 20వ ఓవర్లో సిక్స్ బాదాడు. దాంతో, ఢిల్లీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 221 ర‌న్స్ చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో అశ్విన్(324) ఒక్క‌డే రాణించాడు.

2024-05-07T18:02:34Z dg43tfdfdgfd