IPL: ముంబైకి మరో ఓటమి.. స్టార్క్ మాయాజాలం, KKR ఘన విజయం

ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై జట్టు.. నేడు సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ ఆలౌట్ కావడం గమనార్హం. ముంబై ఇండియన్స్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా, కేకేఆర్ తరఫున మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు.. ముంబై ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబై జట్టు 145 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న కేకేఆర్ జట్టు ఈ విజయంతో పాయింట్లను, రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన వెంకటేష్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై ఇండియన్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (13 పరుగులు, 7 బంతుల్లో)తో పాటు ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ (11 పరుగులు, 12 బంతుల్లో) తక్కువే స్కోరుకే పెవిలియన్ చేరారు. నమన్ దిర్ కూడా తక్కువ స్కోరుకే (11 పరుగులు, 11 బంతుల్లో) ఔట్ అయ్యాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 35 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన సూర్యకుమార్ యాదవ్.. రసెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి, సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మ్యాచ్ కేకేఆర్ చేతుల్లోకి వచ్చింది.

తిలక్ వర్మ (4), హార్దిక్ పాండ్యా (1), నేహాల్ వధేరా (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. చివర్లో టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయిడ్జీ కాసేపు బ్యాట్ ఝళిపించినా.. ముంబైకి విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 18.4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 145 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2, ఆండ్రూ రసెల్ 2 వికెట్లు తీశారు.

కేకేఆర్ ఇన్నింగ్స్ సాగిందిలా..

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత బౌలింగ్ ఎంచుకొని, కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పాండ్యా నిర్ణయానికి తగినట్టు ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడంతో కేకేఆర్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 6.1 ఓవర్లలో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

ఈ దశలో మనీష్ పాండే (42 పరుగులు, 31 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వెంకటేశ్ అయ్యర్ (70 పరుగులు, 52 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగైన ప్రదర్శన చేశారు. చివర్లో ముంబై పేసర్ బుమ్రా మరోసారి విజృంభించడంతో కేకేఆర్ 19.5 ఓవర్లకు 169 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

మనీష్ పాండే, వెంకటేశ్ అయ్యర్ తర్వాత రఘువంశీ చేసిన 13 పరుగులే కేకేఆర్ జట్టు తరఫున మూడో అత్యధిక స్కోరు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. తుషార 3, హార్దిక్ పాండ్యా 2, చావ్లా 1 వికెట్ తీశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T18:23:09Z dg43tfdfdgfd