IPL | హైదరాబాద్‌కు ముంబై షాక్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలు క్లిష్టం!

  • రైజర్స్‌కు సన్‌ స్ట్రోక్‌
  • సూర్యకుమార్‌ సూపర్‌ సెంచరీ

IPL | ఐపీఎల్‌-17 మొదటి అంకంలో భారీ స్కోర్లతో రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో దశలో మాత్రం నిరాశజనక ప్రదర్శనలతో తడబడుతోంది. ప్లేఆఫ్స్‌ రేసులో ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓడి నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. వాంఖడే వేదికగా ముంబైతో మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌.. బంతితోనూ తేలిపోయింది. లక్ష్య ఛేదనలో ముంబై విధ్వంసకవీరుడు సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ సెంచరీతో ఆ జట్టు ఓదార్పు విజయాన్ని అందుకుంది.

ముంబై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి చెత్తప్రదర్శనతో చేతులెత్తేసింది. ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌.. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడింది. బంతితో హైదరాబాద్‌ను 173 పరుగులకే కట్టడిచేసిన ముంబై.. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ (51 బంతుల్లో 102 నాటౌట్‌, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు సెంచరీకి తోడు తిలక్‌ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్‌, 6 ఫోర్లు) రాణించడంతో 17.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 173/8 పరుగుల వద్దే ఆగిపోయింది. ట్రావిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 48, 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (17 బంతుల్లో 35 నాటౌట్‌, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) హైదరాబాద్‌ను ఆదుకున్నారు. సూర్యకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

హెడ్‌, కమిన్స్‌ ఇద్దరే..

మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌కు హెడ్‌ దూకుడుతో శుభారంభమే దక్కింది. ఐదు ఓవర్లకే 50 పరుగుల మార్కును దాటిన ఎస్‌ఆర్‌హెచ్‌ తర్వాత గాడి తప్పింది. తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన అభిషేక్‌ శర్మ (11)ను బుమ్రా ఔట్‌ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. మిడిల్‌ ఓవర్స్‌లో ముంబై స్పిన్నర్‌ చావ్లా, సారథి హార్దిక్‌ పాండ్యా హైదరాబాద్‌ను దెబ్బకొట్టారు. అర్ధసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉండగా హెడ్‌ను చావ్లా ఔట్‌ చేయగా నితీశ్‌ (20)ను హార్దిక్‌ పెవిలియన్‌ చేర్చాడు. చావ్లా 13వ ఓవర్లో క్లాసెన్‌ (2) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. షాబాజ్‌ (10), జాన్సెన్‌ (17) నిరాశపరిచారు. ముంబై బౌలర్ల దూకుడుతో హైదరాబాద్‌ స్కోరు 150 పరుగులైనా చేస్తుందా..? అని అనిపించినా ఆఖర్లో కమిన్స్‌ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో పోరాడగలిగే స్కోరు చేసింది.

సూర్య-తిలక్‌ కేక

లక్ష్య ఛేదనలో ముంబై కూడా తడబడింది. ఇషాన్‌ కిషన్‌ (9), రోహిత్‌ శర్మ (4), నమన్‌ ధీర్‌ (0) 4 ఓవర్లలోపే పెవిలియన్‌ చేరారు. కానీ సూర్య-తిలక్‌ ద్వయం ముంబైని లక్ష్యం దిశగా నడిపించింది. ఈ ఇద్దరూ ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. ఈ జోడీని విడదీయడానికి కమిన్స్‌ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసిన సూర్య ఆ తర్వాత దూకుడు పెంచాడు. తిలక్‌ కూడా వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ లైన్‌ దాటించాడు. అర్ధ సెంచరీ తర్వాత 20 బంతుల్లోనే మిగిలిన 50 పరుగులను పూర్తిచేసిన సూర్య సెంచరీతో పాటు మ్యాచ్‌నూ ముగించాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 143 పరుగులు జోడించింది.

సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్‌: 173/8 (హెడ్‌ 48, కమిన్స్‌ 35 నాటౌట్‌, హార్దిక్‌ 3/31, చావ్లా 3/33).

ముంబై: 17.2 ఓవర్లలో 174/3 (సూర్య 102 నాటౌట్‌, తిలక్‌ 37 నాటౌట్‌, భువీ 1/22, కమిన్స్‌ 1/35)

2024-05-06T21:44:50Z dg43tfdfdgfd