SRHపై డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు.. ఛాంపియన్‌గా నిలబెట్టా అంటూ..!

డేవిడ్ వార్నర్.. తెలుగు క్రికెట్ ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. ఎనిమిదేళ్ల పాటు సన్ రైజర్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్.. 2016లో ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే టీమ్ యాజమాన్యంతో విబేధాల కారణంగా 2021 సీజన్ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అతడిని జట్టు నుంచి తప్పించిన తీరుపై అప్పట్లో దుమారమే రేగింది. తాజాగా దీనిపై డేవిడ్ వార్నర్ స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర బాధకు గురి చేసిందని చెప్పుకొచ్చాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరమైన తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా బ్లాక్ చేశారని, ఇది తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చెప్పుకొచ్చాడు. ఆ జట్టు తరఫున ప్లేయర్‌గా, కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం ఆడానని, ఛాంపియన్‌గా కూడా నిలబెట్టానని, కనీసం ఆ గౌరవం కూడా లేకుండా బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు వార్నర్.

అసలేం జరిగింది..?

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. దీంతో వార్నర్.. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపే ప్రయత్నం చేశాడు. అయితే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్‌ను బ్లాక్ చేసిందనే విషయం తెలిసి వార్నర్ షాకయ్యాడు. ఈ విషయంపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

"సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేయడం చాలా బాధకు గురి చేసింది. దానికి కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులే. నా అభిప్రాయం ప్రకారం ప్లేయర్లకు ఫ్యాన్స్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ అభిమానులతో ఉన్న నా బంధం అసాధారణమైనది. వారితో మాట్లాడటం, కలవడాన్ని నేను ఓ బాధ్యతగా భావించేవాడిని. సన్‌రైజర్స్ నన్ను సోషల్ మీడియాలో ఎందుకు బ్లాక్ చేసిందో నాకు తెలియదు. ఈ విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఇది అత్యంత దారుణమైన చర్య. ఒక కెప్టెన్‌ను సీజన్ మధ్యలోనే తప్పించి తుది జట్టులోకి తీసుకోకపోవడం కరెక్టేనా? ఈ చర్యలతో కుర్రాళ్లకు ఇచ్చే సందేశం ఏంటి? ఇతర ఆటగాళ్లు దీన్ని ఎలా భావించాలి? ఆటగాడిగా, కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నన్ను ఎంతో అవమానించింది" అని డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు.

కాగా 2009లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్‌.. సుమారు ఐదేళ్లపాటు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మారాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. మొత్తంగా వార్నర్‌ 2014 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతని పేలవ ప్రదర్శన నేపథ్యంలో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత తుది జట్టులోకి కూడా తీసుకోలేదు. కనీసం ప్లేయర్ల డగౌట్‌కు కూడా అనుమతించలేదు. 2022 వేలానికి ముందు జట్టు నుంచి రిలీజ్ చేసింది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌ను తీసుకుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T05:05:56Z dg43tfdfdgfd