T20 WORLD CUP: టీమిండియా కొత్త జెర్సీ రిలీజ్.. కోహ్లీ లేకుండానే..!

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భారత సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరో నలుగురు ప్లేయర్లను రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. అయితే టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు తమ జెర్సీని రిలీజ్ చేశాయి. తాజాగా భారత్ సైతం టీ20 ప్రపంచకప్ 2024 కోసం నూతన జెర్సీని ఆవిష్కరించింది.

మరో నాలుగు వారాల్లో టోర్నీకి తెరలేవనున్న నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, టీమిండియా కిట్ స్పాన్సర్ అడిడాస్.. జెర్సీని అధికారికంగా సోమవారం రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వినూత్నంగా హెలికాప్టర్ ద్వారా జెర్సీని ప్రదర్శిస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలను కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్‌లు ధర్మశాల స్టేడియం నుంచి ఆసక్తికరంగా వీక్షించినట్లు వీడియోను రూపొందించింది. అయితే ఈ వీడియోలో విరాట్ కోహ్లీ లేకపోవడం గమనార్హం.

కాగా ఈ కొత్త జెర్సీని నీలం, కాషాయం రంగులో ఉన్నాయి. ఈ జెర్సీలు మే 7 నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటాయని అడిడాస్ పేర్కొంది. అయితే అధికారికంగా అడిడాస్ జెర్సీని ప్రకటించకముందే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన జెర్సీ ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో మాకు ముందే తెలుసు కదా అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. భారత్ తన తొలి మ్యాచులో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌.

రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T17:34:35Z dg43tfdfdgfd