T20 WORLD CUP | పొట్టి పోరుకు ఉగ్ర ముప్పు.. భద్రత విషయంలో రాజీ లేదన్న ఐసీసీ

  • ట్రినిడాడ్‌ ప్రధాని వెల్లడి

T20 World Cup | పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: మరో నాలుగు వారాల్లో వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికలుగా మొదలుకావాల్సి ఉన్న ఐసీసీ పురుషుల ప్రపంచకప్‌లో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్రపన్నినట్టు ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో ప్రధానమంత్రి కీత్‌ రౌలే వెల్లడించడం కలకలం రేపింది. సోమవారం ఆయన ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం దురదృష్టకరం. భారీ టోర్నీలు జరిగేప్పుడు ఉగ్రమూకలు ముప్పు తలపెట్టే అవకాశం లేకపోలేదు. భద్రత విషయంలో మేం మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తాం. టోర్నీలో ఆడే ప్రతి ఒక్క ఆటగాడికీ, మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే మా ఇంటిలిజెన్స్‌, ఇతర భద్రతా విభాగాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయి’ అని అన్నారు.

పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి ఉగ్ర ముప్పు తలపెట్టదలచిన సంస్థ పేరును ఆయన నేరుగా ప్రకటించనప్పటికీ ఈ కుట్రల వెనుక ‘ఇస్లామిక్‌ స్టేట్‌’ హస్తమున్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్రినిడాడ్‌ ప్రధాని ఈ ప్రకటన చేయగానే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ వార్తలు వచ్చినప్పట్నుంచి ఆతిథ్య దేశాల ప్రతినిధులతో తాము ఎప్పటికప్పుడూ చర్చిస్తున్నామని, ఎలాంటి ప్రమాదాన్నైనా తట్టుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్టు భరోసా కల్పించింది. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సైతం టోర్నీలో పాల్గొనబోయే ప్రతి ఒక్క ప్లేయర్‌ భద్రతకు హామీ ఇచ్చిందని తెలిపింది.

2024-05-06T20:44:45Z dg43tfdfdgfd