ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరొచ్చు ఇలా.. లెక్కలేసి చెబుతున్న బెంగళూరు ఫ్యాన్స్..!

ఆర్సీబీ ఫ్యా్న్స్‌కు కాలిక్యుటేర్లకు మధ్య అనుబంధం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఐపీఎల్ సీజన్ చివరికి వచ్చేసరికి.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలను లెక్కించడం కోసం ఆర్సీబీ అభిమానులు నానా తంటాలు పడుతుంటారు. ప్లేఆఫ్స్ చేరడం కోసం.. ఆర్సీబీ గత సీజన్లో చివరి మ్యాచ్ దాకా పోరాడింది. ఈ సీజన్లో ఫస్ట్ 8 మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో మాత్రమే గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరొక్క మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే.. బెంగళూరు ప్లేఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్‌గా తప్పుకునేదే.

కానీ పెందుర్తి బాబు ఆఖరి ఓటు వరకు ఓటమిని ఒప్పుకోడు అన్నట్టుగా.. ఆర్సీబీ మరోసారి పట్టుదలను ప్రదర్శిస్తోంది. బలమైన సన్‌రైజర్స్‌ను హైదరాబాద్‌లో ఓడించిన బెంగళూరు జట్టు... ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో ప్లేస్‌కు ఎగబాకింది.

దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని బెంగళూరు ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఇందుకోసం లెక్కలు కూడా కడుతున్నారు. ఆర్సీబీ అభిమానుల లెక్కల ప్రకారం.. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ఆ జట్టు 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బెంగళూరు ఫ్యాన్స్ వేసిన ఈ లెక్క ప్రకారం చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే ఆ జట్టు రాజస్థాన్ చేతిలో ఓడి మిగతా మూడు మ్యా్చ్‌ల్లో గెలవాలి. సన్‌రైజర్స్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. మూడింట్లో గెలవాలి. లక్నో, చెన్నై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ఢిల్లీ మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లోనే గెలవాలి. అది కూడా లక్నో మీదే.

అప్పుడు 24 పాయింట్లతో రాజస్థాన్, 20 పాయింట్లతో కోల్‌కతా, 18 పాయింట్లతో సన్‌రైజర్స్, 14 పాయింట్లతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. లక్నో, ఢిల్లీ 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో నిలుస్తాయి. చెన్నై సహా మిగతా నాలుగు జట్ల ఖాతాలో పది పాయింట్లు ఉంటాయి. కాస్త గందరగోళంగా ఉందా..? ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం క్లారిటీతో ఉన్నారులేండీ. అయితే అనుమానం ఏంటంటే.. ఆర్సీబీ తన చివరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించగలదా..? లక్నోను ఢిల్లీ, ముంబై ఓడించగలవా..? ఏమో ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఆర్సీబీ ఆడే చివరి మూడు మ్యాచ్‌ల విషయానికి వస్తే.. మే 9న పంజాబ్ కింగ్స్‌తో, మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరు తలపడనుంది. పంజాబ్‌తో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుండగా.. మిగతా రెండు మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T08:59:27Z dg43tfdfdgfd