పంజాబ్‌ను ఓడించి కమ్‌బ్యాక్ ఇచ్చిన చెన్నై.. రసవత్తరంగా ప్లే ఆఫ్స్ రేసు..!

ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే గెలవాల్సిన మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచులో 167/9 పరుగులు చేసిన సీఎస్కే.. అనంతరం పంజాబ్‌ను 139/9కి పరిమితం చేసింది. దీంతో ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచుకు మందు వరకు పంజాబ్ చేతిలో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన సీఎస్కే.. ఈ ఫలితంతో పరాజయాల పరంపరకు చెక్ పెట్టింది.

చెన్నై 167 పరుగులకే పరిమితం కావడంతో విధ్వంసకర బ్యాటర్లతో నిండిన పంజాబ్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. దానికి తోడు సీఎస్కే స్టార్ పేసర్ మతీశ పథిరన కూడా ఈ మ్యాచుకు దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపించింది. కానీ పంజాబ్‌ కింగ్స్‌కు రెండు ఓవర్లలోపే షాక్ తగిలింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (7), రిలీ రూసో (0)జట్టు స్కోరు 10 కూడా దాటకముందే ఔట్ అయ్యారు. తుషార్ దేశ్‌పాండే.. సీఎస్కేకు బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ (23 బంతుల్లో 30 రన్స్), శశాంక్ సింగ్ (20 బంతుల్లో 27 రన్స్) నిలబడటంతో 62/2తో నిలిచింది.

కానీ స్వల్ప వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్.. 78/7తో నిలిచింది. దీంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది. సామ్ కర్రన్ (7), జితేశ్ శర్మ (0), అశుతోష్ శర్మ (3)లు విఫలమయ్యారు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 139/9కి పరిమితమైంది. 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్‌జీత్ సింగ్ 2, తుషార్ దేశ్ పాండే 2, శార్దుల్ ఠాకూర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 167/9 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేరిల్ మిచెల్ (30), రుతురాజ్ గైక్వాడ్ (32) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3, హర్షల్ పటేల్ 3, అర్షదీప్ సింగ్ 2, సామ్ కర్రన్ 2 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ ఫలితంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఐదో ప్లేసు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. 11 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచిన సీఎస్కే.. మిగిలిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరినట్లే..!

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T13:45:14Z dg43tfdfdgfd