బీస్ట్ మోడ్‌లోకి ఆర్సీబీ.. ఇది బెంగళూరుకే సాధ్యం.. ఆ ఒక్క మ్యాచ్ గెలిచి ఉంటేనా..!?

ఐపీఎల్ 2024 లీగ్ ఫేజ్ చివరి దశలో ఆర్సీబీ అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. టెక్నికల్‌గా చూస్తే ఆర్సీబీకి ఇప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా జట్ల ప్రదర్శన కూడా కీలకం కానుంది.

వాస్తవానికి ఈ సీజన్ ఆరంభంలో ఆర్సీబీ పేలవ ప్రదర్శన చేసింది. తొలి 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక దాంట్లో గెలిచి.. రెండు పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో చిట్ట చివరన నిలిచింది. మార్చి 25న పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన ఆర్సీబీ.. ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్ 25న గానీ రెండో విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

వరుస ఓటములతో నిరాశపర్చి.. ఇప్పుడు వరుస విజయాలతో ఉత్సాహం మీదున్న ఆర్సీబీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రతి సీజన్లోనూ ఆరంభ మ్యాచ్‌ల్లో తేలిపోవడం.. ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్న తర్వాత చెలరేగడం ఆర్సీబీకి అలవాటుగా మారిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ జట్టు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాక.. బెంగళూరు బౌలర్లు ఓ రేంజ్‌లో చెలరేగిపోతారంటూ.. గత మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ బౌలర్లు రాణించిన తీరుపై సెటైరికల్‌గా స్పందిస్తున్నారు.

ఆర్సీబీ తొలి 8 మ్యాచ్‌ల్లో కనీసం మరో మ్యాచ్‌లోనైనా గెలిచి ఉండుంటే.. ఇప్పుడు సాధిస్తోన్న విజయాల కారణంగా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మెండుగా ఉండేవి. కానీ అప్పుడు కోహ్లి మాత్రమే బ్యాట్‌తో రాణించడం.. మిగతా బ్యాటర్లతోపాటు బౌలర్లెవరూ ఫామ్‌లో లేకపోవడం వల్ల ఆర్సీబీని దెబ్బతీసింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడటం ఆర్సీబీని తీవ్రంగా దెబ్బతీసింది. 223 పరుగుల లక్ష్య చేధనలో.. ఆర్సీబీ విజయానికి చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా. కర్ణ్ శర్మ నాలుగు బంతుల్లో మూడు సిక్సులు బాదాడు. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా.. ఒక్క రన్ మాత్రమే చేసిన ఆర్సీబీ ఓటమిపాలైంది.

ప్రస్తుత సీజన్‌తో పోలిస్తే.. ఐపీఎల్ 2023లో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేసింది. మధ్యలో తడబడినా చివర్లో మాత్రం మంచి విజయాలు సాధించి ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. కానీ చివరి లీగ్ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడటంతో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T07:59:16Z dg43tfdfdgfd