ముంబై ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణం: ఇర్ఫాన్ పఠాన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. శుక్రవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో ఓటమి పాలైన ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది! ఈ సీజన్‌లో 8 పరాజయలు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ ప్లేసులో ఉన్న ముంబై.. మిగిలి మూడు మ్యాచుల్లోనూ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఇంటికి వెళ్లినట్లే!

ఇక ఈ సీజన్‌లో రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేసింది ముంబై. ఈ నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. దీంతో ముంబై ఫ్యాన్స్ అవకాశం వచ్చిన ప్రతీసారి హార్దిక్‌ను హేళన చేస్తూ కనిపించారు. వాటికి తోడు అతడు ఈ సీజన్‌లో ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ విఫలమవడం కూడా జట్టు కష్టాలను రెట్టింపు చేసింది. దీంతో విమర్శల తాకిడి పెరిగింది. ఇక హార్దిక్‌ను విమర్శించే జాబితాలో టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ముందు వరసలో ఉన్నాడు.

ఈ సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచీ అతడి ఆటతీరు, కెప్టెన్సీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచు సందర్భంగానూ ఇదే చేశాడు. ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసింది. అయితే ఓ దశలో ఫస్టు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 57/5తో నిలిచి కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు సుమారు 120 లోపు ఆలౌట్ అవుతుందని.. ముంబైకి ఈజీ విన్ దక్కుతుందని అంతా భావించారు. కానీ వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70 రన్స్), మనీశ్ పాండే (31 బంతుల్లో 42 రన్స్)లు జట్టును ఆదుకున్నారు. జట్టు స్కోరును 170 రన్స్‌కు చేరువచేశారు.

అయితే కేకేఆర్.. 57/5తో ఉన్న సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలు ముంబై కొంప ముంచాయని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. అప్పటికే ఐదు వికెట్లు పడ్డ దశలో నమన్ ధీర్‌కు మూడు ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరొక్క వికెట్ అప్పుడే పడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. నువాన్ తుషారా, బుమ్రా, గెరాల్డ్ కొయెట్జీ వంటి బౌలర్లు వికెట్ తీసే వారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కాగా ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇర్ఫాన్ పఠాన్.. హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పిస్తున్నాడు. దీంతో ఇలా వరుసగా విమర్శలు చేయడంపై.. ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగుతున్నారు. హార్దిక్ పాండ్యాను విమర్శిస్తూ వంద ట్వీట్లు చేసే మీరు.. రోహిత్ శర్మపై ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయరు? అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోహిత్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఇలా చేస్తున్నారని మరికొందరు పేర్కొంటున్నారు.

నీ మాటల్ని సీరియస్‌గా తీసుకునేవారు ఎవరూ లేరు.. నీకంటే హార్దిక్ పాండ్యా పది రెట్లు బెటర్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T02:39:34Z dg43tfdfdgfd