మళ్లీ టాస్ ఓడిన చెన్నై.. 11 మ్యాచ్‌లలో 10 సార్లు టాస్ ఓటమి, రుతురాజ్ రియాక్షన్ ఇదే

ఐపీఎల్ 2024తో రుతురాజ్ గైక్వాడ్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సారథ్యాన్ని వదులుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం లభించింది. అయితే కెప్టెన్‌గా తొలి సీజన్‌లో గైక్వాడ్ అదిరే ప్రదర్శన చేస్తున్నాడు. 11 మ్యాచుల్లో 541 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ (542) తర్వాతి స్థానంలో ఉన్నాడు గైక్వాడ్.

అయితే ఆటగాడిగా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్‌గా మాత్రం.. గైక్వాడ్‌‌కు ఏమాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో 11 సార్లు టాస్‌కు వెళ్లిన రుతురాజ్.. అందులో కేవలం ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచాడు. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడిపోయాడు. ఈ సీజన్‌లో అతడు టాస్ ఓడిపోవడం దీంతో పదోసారి కావడం గమనార్హం.

ఇలా వరుసగా టాస్ ఓడిపోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. టాస్ ఫలితాన్ని పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. పంజాబ్‌తో గత రికార్డులపై సైతం ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. ‘మా జట్టు (చెన్నై సూపర్ కింగ్స్)పై పంజాబ్ కింగ్స్‌కు ఉన్న రికార్డును పట్టించుకోవడం లేదు. మా ఆటపైనే దృష్టి సారిస్తున్నాం. ఈ సీజన్‌లో పది మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయాం. అయితే అందులో ఐదు మ్యాచుల్లో గెలవడం సానుకూలాంశం’ అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

కాగా ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు ఈ మ్యాచులో గెలవడం ఎంతో ముఖ్యం. ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచుల్లో సీఎస్కే ఐదింట్లో గెలుపొందింది. ఇక పంజాబ్‌తో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 167/9 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేరిల్ మిచెల్ (30), రుతురాజ్ గైక్వాడ్ (32) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3, హర్షల్ పటేల్ 3, అర్షదీప్ సింగ్ 2, సామ్ కర్రన్ 2 వికెట్లు తీశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T12:30:01Z dg43tfdfdgfd