వచ్చే ఏడాది ఒకేసారి జరగనున్న ఐపీఎల్, పీఎస్ఎల్..! ఎందుకంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 2008లో ప్రారంభమైనప్పటి నుంచి విజయవంతంగా కొనసాగుతోంది ఈ లీగ్. ఈ లీగ్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు వచ్చాయి. కానీ ఏవీ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. దీంతో అనతి కాలంలోనే ప్రపంచంలోనే రిచ్చెస్ట్ లీగ్‌గా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లోని స్టార్ ప్లేయర్లు సైతం ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ లీగ్‌ ప్రతీ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరుగుతుంది.

ప్రతీ వేసవిలోనూ రెండు నెలల పాటు ప్రేక్షకులను అంతులేని వినోదాన్ని అందిస్తోంది ఐపీఎల్. ప్రస్తుతం ఐపీఎల్-17వ సీజన్ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ స్ఫూర్తితో మన దాయాది దేశం పాకిస్థాన్‌ కూడా ఓ లీగ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ సూపర్ లీగ్ పేరిట ఈ టోర్నీ జరుగుతోంది. ఐపీఎల్‌లో పాల్గొనే పలువురు విదేశీ క్రికెటర్లు ఈ లీగ్‌లోనూ ప్రాతినిధ్యం వహిస్తుంటారు. వాస్తవానికి ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రారంభానికి ముందే పీఎస్‌ఎల్‌ను నిర్వహిస్తారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ రెండు లీగ్‌లు కూడా ఒకే సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా ఐసీసీ క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు ఏప్రిల్-మే నెల్లలో చోటు ఉంటుంది. ఈ రెండు నెలలు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పెద్దగా సిరీస్‌లు ఉండవు. ఆయా దేశాల ప్లేయర్లు ఈ లీగ్‌లో ఆడటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్‌ను మార్చాలని పీసీబీ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలతో పీసీబీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

"ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి మేం (పాకిస్థాన్) ఆతిథ్యం ఇవ్వనున్నాం. దీంతో మా దేశంలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను ఏప్రిల్ 7 నుంచి మే 20 వరకు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. దీనిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు రెండు లీగుల్లోనూ (ఐపీఎల్, పీఎస్ఎల్) కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా ఆయా ఫ్రాంఛైజీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీఎస్ఎల్ ప్లే ఆఫ్స్ కోసం వేదికలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది" అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఏఏ సల్మాన్ నసీర్ తెలిపారు.

ఐపీఎల్ జరిగే సమయంలోనే పీఎస్ఎల్ జరిగితే.. రెండు లీగుల్లోనూ ఆడే ఆటగాళ్లు ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T02:17:09Z dg43tfdfdgfd