వార్నర్‌ 70% భారతీయుడు, 30% ఆస్ట్రేలియా పౌరుడు.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డేవిడ్‌ వార్నర్. భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌కు.. ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఎనిమిదేళ్ల పాటు ఆడిన ఈ ఆస్ట్రేలియా ఓపెనర్.. 2016లో తన సారథ్యంలో ట్రోఫీని అందించాడు. 2009లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్‌.. సుమారు ఐదేళ్లపాటు ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మారాడు. 2016లో జట్టును విజేతగా నిలిపాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మారిపోయాక.. వార్నర్‌ కాస్త వార్నర్‌ భాయ్‌గా మారిపోయాడు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు.

మైదానంలోనే కాకుండా తెలుగు సినిమా పాటలకు రీల్స్‌, డ్యాన్స్‌, స్పూఫ్‌లు చేస్తూ సుపరిచితుడయ్యాడు. దీంతో భారత క్రికెట్‌ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో ఒకడిగా వార్నర్‌ మారిపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. తెలుగు చిత్రాలను మాత్రం వదలడం లేదు. ఇటీవల స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళితో ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నాడు.

ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సహచర ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌తో జరిగిన సరదా సంభాషణ సందర్భంగా ఫ్రేజర్‌.. వార్నర్‌ను ఉద్దేశించి మాట్లాడాడు.

“నేను ఇప్పటివరకు కలిసిన క్రికెటర్లలో నిస్వార్థ ఆటగాళ్లలో ఒకడు డేవిడ్ వార్నర్. ప్రతిఒక్కరి కోసం అతడు టైమ్‌ ఇచ్చేవాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు రెడీగా ఉంటాడు. హోటల్‌లోనూ నా రూమ్‌కు సమీప గదుల్లోనే ఉంటాడు. రోజూ ఉదయం అతడితో కలిసి కాఫీ తాగేవాడిని. ఒక్కోసారి వార్నర్‌ను చూస్తుంటే.. ఆస్ట్రేలియా పౌరుడిగా కంటే భారతీయుడిగానే అనిపిస్తాడు. అందుకే, డేవిడ్‌ వార్నర్ 70% ఇండియన్‌, 30% ఆస్ట్రేలియన్‌ అని నేను అంటా. అతడికి గొప్ప మనసు ఉంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ గురించి చాలా విన్నా. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తోంది. నేను ఎప్పుడూ పెద్దగా అంచనాలు లేకుండానే ఆడేందుకు ప్రయత్నిస్తా” అని జేక్‌ తెలిపాడు.

ఇకే ఇదే సమయంలో స్టబ్స్‌ కూడా వార్నర్‌ గురించి మాట్లాడాడు. “వార్నర్‌ గురించి నాకేమీ తెలియదు. కానీ నా స్టోరీ అతడికి తెలుసు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ను ఆస్వాదిస్తున్నా. మన మీద ఉన్న అంచనాలను అందుకునే క్రమంలో ఒత్తిడి ఉంటుంది. కానీ దాన్ని అధిగమించి రాణించడంం చాలా ఆనందంగా ఉంటుంది” అని స్టబ్స్‌ వ్యాఖ్యానించాడు.

కాగా డేవిడ్‌ వార్నర్‌ 2014 నుంచి 2021 వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడాడు. ఫ్రాంఛైజీతో విబేధాల కారణంగా 2022 సీజన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మారిపోయాడు. కానీ వీలు చిక్కినప్పుడల్లా తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T17:57:06Z dg43tfdfdgfd