సెంచరీతో ముంబైని గెలిపించిన సూర్య.. ప్లే ఆఫ్స్ ముగింట సన్‌రైజర్స్‌కు షాక్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ఏడు వికెట్లు తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో 11వ మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్.. ఐదో ఓటమికి నమోదుకు దాదాపుగా దూరమైన ముంబై ఇండియన్స్.. ఈ ఫలితంతో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఒంటి చేత్తో ముంబైని గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా అవార్డులు అందుకున్నారు. సూర్యకుమార్ యాదవ్‌కు ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది రెండో సెంచరీ.

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ (9), రోహిత్ శర్మ (4), నమన్ దీర్ (0)లు ఔట్ కావడంతో ఓ దశలో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 102 పరుగులు చేసి.. జట్టుకు విజయాన్ని అందించాడు. సూర్య మెరుపులతో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (37) సైతం రాణించాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 173/8 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 48 రన్స్), ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 రన్స్)తో జట్టును ఆదుకున్నారు. వాస్తవానికి ఓ దశలో సన్ రైజర్స్ 150 పరుగులలోపే పరిమితం అయ్యేలా కనిపించింది. 136 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కమిన్స్.. 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో జట్టు స్కోరును 170 దాటించాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, పీయూష్ చావ్లా 3, అన్సుల్ కంబోజ్ 1, జస్‌ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T18:19:44Z dg43tfdfdgfd