ఐపీఎల్‌లో అదరగొడుతున్న సన్‌రైజర్స్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి..!

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ అదరగొట్టే ప్రదర్శన చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలవడం ద్వారా వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఓటమి పాలైంది. ఆ రెండు కూడా హోం గ్రౌండ్ మ్యాచ్‌లు కాకపోవడం గమనార్హం. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత సొంత గడ్డ మీద ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగుల రికార్డ్ స్కోరు నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది.

కానీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శనతో ఓడింది. ఆ తర్వాత ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 165 పరుగులకే పరిమితం చేసిన సన్‌రైజర్స్‌.. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. చెన్నైను చిత్తు చేసిన తర్వాత ఛండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగులు చేసిన హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

ఇక చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనైతే సన్‌రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 287 పరుగులు చేయగా.. ఆర్సీబీ 262 పరుగులు చేసింది. ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ 266 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 199 పరుగులకే పరిమితం కావడంతో 67 రన్స్ తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

ఇప్పటి దాకా ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ మరో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ఏడు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచినా చాలు ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. కానీ సన్‌రైజర్స్ ఊపు చూస్తుంటే.. పాయింట్స్ టేబుల్‌లో ఒకటి లేదా రెండో స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. 7 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ 12 పాయిట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచి.. 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో కోల్‌కతా (+1.399) మాత్రమే సన్‌రైజర్స్ (+0.914) కంటే ముందుంది.

చెరో ఏడు మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌ల్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. హ్యాట్రిక్ ఓటములతో సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఆరో స్థానంలో నిలవగా.. 8 మ్యాచ్‌ల్లో 3 గెలిచిన ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ టైటాన్స్ 8వ స్థానంలో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచిన పంజాబ్ కింగ్స్ 9వ స్థానంలో, ఒక్క మ్యా్చ్‌లో మాత్రమే గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో ఉన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-21T04:20:38Z dg43tfdfdgfd