సంతోషంగా ఉంది.. టీ20 ప్రపంచకప్‌లో ఆడను: సునీల్ నరైన్

రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని.. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌, టీ20 ప్రపంచకప్‌ ఆడే ఆలోచన లేదని సునీల్‌ నరైన్‌ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌ 2024లో ఓపెనర్‌గా విశేషంగా రాణిస్తున్న నరైన్.. బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దీంతో అతడ్ని అంతర్జాతీయ క్రికెట్‌ జట్టులోకి తీసుకోవాలని, తిరిగి వెస్టిండీస్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడించాలని డిమాండ్‌లు వినిపించాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ చెక్‌ పెడుతూ సునీల్‌ నరైన్‌.. ఓ ప్రకటన విడుదల చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం అసాధ్యమని, రీఎంట్రీకి డోర్లు మూసుకుపోయాయని పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో తన ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని చెప్పాడు.

“నేను టీ20 ప్రపంచకప్‌ 2024 ఆడాల‌నే అభిమానుల ప్ర‌తిపాద‌న‌ను గౌర‌విస్తాను. కానీ నాకు ఆ ఆలోచన లేదు. నేను నా రిటైర్మెంట్‌ నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నా. తిరిగి అంతర్జాతీయ జట్టులోకి వచ్చే ఆలోచన లేదు. ఇప్పుడు ఆ తలుపులు మూసుకుపోయాయి. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం వెస్టిండీస్‌ తరఫున ఆడే కుర్రాళ్లకు నా సపోర్ట్‌ ఉంటుంది. గత కొన్ని నెలలుగా కష్టపడ్డ కుర్రాళ్లకు కప్పు గెలిచే సత్తా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌” అని సునీల్‌ నరైన్‌ పేర్కొన్నాడు.

సునీల్‌ నరైన్‌ 2019లో చివరిసారిగా వెస్టిండీస్‌కు ఆడాడు. అతను 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కాగా ఇటీవల టీ20 క్రికెట్‌లో సత్తాచాటుతున్న 35 ఏళ్ల నరైన్‌ను విండీస్‌ తరఫున ఆడించాలనే డిమాండ్‌లు వచ్చాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్‌ రోవ్‌మన్ పావెల్‌ సైతం నరైన్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని ఒప్పించేందుకు తాను గతకొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. అయితే నరైన్‌ ప్రకటనతో టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆడటం లేదని తేలిపోయింది.

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో సునీల్‌ నరైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో 7 మ్యాచుల్లో 286 రన్స్‌ చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 109 రన్స్‌ చేశాడు. బౌలింగ్‌లోనూ 9 వికెట్లు డగొట్టాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌ సాధించిన విజయాల్లో నరైన్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T08:42:28Z dg43tfdfdgfd