IPL 2024 | మిస్ట‌రీ చాహ‌ల్.. చ‌రిత్ర లిఖించెన్

IPL 2024 : ఐపీఎల్‌లో మిస్ట‌రీ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్(Yazvendra Chahal) చరిత్ర లిఖించాడు. టీమిండియా సెలెక్ట‌ర్ల‌కు స‌వాల్ విసురుతూ ఈ మెగా టోర్నీలో 200 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి బౌల‌ర్‌గా బ‌క్క‌ప‌ల‌చ‌ని చాహ‌ల్ రికార్డు పుట‌ల్లోకి ఎక్కాడు. ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జైపూర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో చాహ‌ల్ ఈ ఫీట్ సాధించాడు.

మ‌హ‌మ్మ‌ద్ న‌బీని రిట‌ర్న్ క్యాచ్‌తో వెన‌క్కి పంపిన చాహ‌ల్ 200 వికెట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు. అంతే.. చేతుల్లో ఊపుతూ నేను సాధించానోచ్ అంటూ సంబురాలు చేసుకున్నాడు. కెరీర్‌లో కీల‌క మైలురాయికి చేరిన చాహ‌ల్‌ను స‌హ‌చ‌రులు అభినందించారు. గ‌తంలో ముంబై ఇండియ‌న్స్, ఆర్సీబీ, జ‌ట్ల‌కు ఆడిన చాహ‌ల్ 153 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఒక‌ప్పుడు చాహ‌ల్ లేని టీమిండియాను ఊహించుకోలేం. కుల్దీప్, అశ్విన్ జ‌తగా చాహ‌ల్ వికెట్ల వేట‌తో భార‌త్‌కు విజ‌యాలు క‌ట్ట‌బెట్టాడు. కానీ, బ్యాట‌ర్‌గా ర‌న్స్ కొట్ట‌లేక‌పోవ‌డ‌మే అత‌డి పాలిట శాప‌మైంది. 8, 9వ స్థానాల్లోనూ కొద్దో గొప్పో ఆడ‌గ‌ల బౌల‌ర్ కావాల‌నే కండిష‌న్ చాహ‌ల్‌ను టీమిండియా జెర్సీకి దూరం చేసింది. అయినా స‌రే త‌నేమీ బ‌హిరంగంగా సెలెక్ట‌ర్ల‌పై నోరు పారేసుకోలేదు. ఎక్క‌డ రాణిస్తే జ‌ట్టులోకి రావొచ్చో ఈ లెగ్ స్పిన్న‌ర్ బాగా తెలుసు.

అందుక‌నే ఐపీఎల్‌లో త‌న స్పిన్ ప‌వ‌ర్ చూపించ‌డం మొద‌లెట్టాడు. 17వ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 12 వికెట్లు తీసి ప‌ర్పుల్ క్యాప్ బ‌రిలో నిలిచాడు. ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లోనైనా త‌న‌ను సెలెక్ట‌ర్లు క‌రుణిస్తార‌నే ఆశ‌తో చాహ‌ల్ ఎదురుచూస్తున్నాడు. అత‌డి క‌మ్ బ్యాక్ క‌ల నెర‌వేర‌నుందా? లేదా? అనేది మ‌రికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

టాప్ 5లో వీళ్లే

ఐపీఎల్‌లో అత్య‌ధిక వికెట్ల వీరుల జాబితాలో చాహ‌ల్ టాప్‌లో ఉండ‌గా… డ్వేన్ బ్రావో 183 వికెట్ల‌తో రెండో స్థానంలో నిలిచాడు. పీయూష్ చావ్లా (182 వికెట్లు) మూడు, భువ‌నేశ్వ‌ర్ కుమార్(174 వికెట్లు) నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నారు. అమిత్ మిశ్రా 173 వికెట్ల‌తో ఐదో స్థానం ద‌క్కించుకున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-04-22T17:44:49Z dg43tfdfdgfd