IPL | ఐపీఎల్‌లో హైదరాబాద్‌ రికార్డుల మోత.. ఢిల్లీపై సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ

  • హెడ్‌, షాబాజ్‌, అభిషేక్‌ వీరవిహారం
  • జేక్‌ ఫ్రేజర్‌ ఒంటరి పోరు వృథా
  • ఢిల్లీపై సన్‌రైజర్స్‌ ఘన విజయం

హైదరాబాద్‌: 266/7,

ఢిల్లీ: 199 ఆలౌట్‌

మొత్తం: 465

ఫోర్లు: 40, సిక్స్‌లు: 31

‘ఎవడన్నా కోపంగా కొడుతాడు..లేకపోతే బలంగా కొడుతాడు..వీళ్లేంట్రా చాలా భయంకరంగా కొట్టారు. ఏదో పగతో రగిలిపోతున్నట్లు…బౌండరీలు చిన్నబోయేటట్లు.. చాలా బీభత్సంగా..పరుగుల సునామీ సృష్టించారు’

శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ చూసిన ప్రతీ అభిమానికి కల్గిన అనుభవమిది. ప్రత్యర్థిపై కనీసం కనికరం లేకుండా బౌలర్లను వీరబాదుడు బాదుతూ తమ రికార్డులను తామే తిరుగరాసుకుంటున్న సన్‌రైజర్స్‌..ఢిల్లీలో పరుగుల సునామీ సృష్టించింది. తాము అడుగుపెట్టనంత వరకే అడుగుపెడితే మసే అన్న రీతిలో ట్రావిస్‌హెడ్‌, అభిషేక్‌శర్మ..ఢిల్లీ బౌలింగ్‌ బ్యాచ్‌ను బండకేసి కొట్టారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు..మైదానంలో ఫీల్డర్లు కుదురుకోకముందే హెడ్‌, అభిషేక్‌ పరుగుల వరదకు ఫ్లడ్‌గేట్లు ఎత్తారు. తొలి ఓవర్‌లోనే మొదలైన వీరి విధ్వంసం ఓవర్‌ ఓవర్‌కు పతాకస్థాయికి చేరుకుంది. పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా హైదరాబాద్‌ 125 పరుగులు చేసిందంటే వీరి విధ్వంస రచన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరి విజృంభణకు ఈసారి 300 పక్కా అనుకుంటున్న తరుణంలో కుల్దీప్‌ రంగప్రవేశంతో సీన్‌ మారిపోయింది. ఒకే ఓవర్లో అభిషేక్‌, మార్క్మ్‌ ఔట్‌తో ఢిల్లీ పోటీలోకి వచ్చింది. క్లాసెన్‌ నిరాశపరిచినా.. షాబాజ్‌ మెరుపులు మెరిపించడంతో మరిన్ని రికార్డులు బద్దలయ్యాయి.

లక్ష్యఛేదనలో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఫించ్‌ హిట్టర్‌ జేక్‌ ఫ్రేజర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో హైదరాబాద్‌ బౌలర్లను తనదైన రీతిలో బాదాడు. దొరికిన బంతిని దొరికినట్లు కసిగా బౌండరీలు బాది..సన్‌రైజర్స్‌ దీటుగా పోటీలో నిలిపేందుకు ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో సహచర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఛేదన సాధ్యం కాలేదు.

IPL | ఢిల్లీ: ఐపీఎల్‌లో మరోమారు పరుగుల వరద సునామీల ముంచెత్తింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు హ్యారికేన్‌లా విధ్వంసం సృష్టించారు. బౌండరీల వర్షంలో ముద్దయిన మ్యాచ్‌లో ఢిల్లీపై 67 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో 266/7 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌(32 బంతుల్లో 89, 11ఫోర్లు, 6సిక్స్‌లు), అభిషేక్‌శర్మ(12 బంతుల్లో 46, 2 ఫోర్లు, 6 సిక్స్‌లు)కు తోడు మిడిలార్డర్‌లో షాబాజ్‌ అహ్మద్‌(29 బంతుల్లో 59 నాటౌట్‌, 2ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారం చేశారు. ఈ ముగ్గురు బ్యాటర్లు ఏ మాత్రం కనికరం లేకుండా ఢిల్లీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా సన్‌రైజర్స్‌ 125 పరుగులు చేసింది. సుదీర్ఘ ఐపీఎల్‌ చరిత్రలో ఇది నయా రికార్డుగా నమోదైంది. కుల్దీప్‌యాదవ్‌(4/55) నాలుగు వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ..19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. జేక్‌ ఫ్రేజర్‌(18 బంతుల్లో 65, 5ఫోర్లు, 7 సిక్స్‌లు), రిషబ్‌ పంత్‌(44), అభిషేక్‌(42) సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. నటరాజన్‌(4/19) నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. మయాంక్‌ (2/26), నితీశ్‌కుమార్‌(2/17) రెండేసి వికెట్లు తీశారు. హెడ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోరుతో ఈ మ్యాచ్‌లో 465 పరుగులు నమోదయ్యాయి.

హెడ్‌, అభిషేక్‌ నాటు కొట్టుడు:

టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌..హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక్కడే తప్పిదానికి తొలి అడుగు పడింది. ఇంకేముంది లీగ్‌లో ఇప్పటికే తమ రికార్డులను తాము తిరుగరాస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..మరోమారు ఈసారి ఢిల్లీ పనిపటింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌..ఖలీల్‌ అహ్మద్‌ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ రెండో బంతి నుంచే సిక్స్‌తో తమ విధ్వంస రచనకు తెరతీశారు. ఇక్కణ్నుంచి పిచ్‌పై పడిన దాదాపు ప్రతి బంతి బౌండరీని ముద్దాడింది. హెడ్‌ రెండు ఫోర్లు, అభిషేక్‌ ఫోర్‌తో 19 పరుగులు వచ్చిపడ్డాయి. లలిత్‌ యాదవ్‌ రెండో ఓవర్‌లో హెడ్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 21 పరుగులు స్కోరుబోర్డుకు జతకలిశాయి. నోకియా వేసిన మూడో ఓవర్‌ పరుగుల తాకిడిని పతాకస్థాయికి తీసుకెళ్లింది. ఈ ఓవర్‌లో హెడ్‌ నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్నాడు. తానేం తక్కువ అన్నట్లు మరో ఎండ్‌లో అభిషేక్‌ మెరుపుదాడికి దిగడంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ 103 పరుగుల మార్క్‌ అందుకుంది. బౌలింగ్‌ మార్పుగా వచ్చిన ముకేశ్‌కుమార్‌ను హెడ్‌ గట్టిగా అరుసుకున్నాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లకు తోడు ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ 125 పరుగులు చేసింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటున్న తరుణంలో కుల్దీప్‌ ఒకే ఓవర్లో అభిషేక్‌, మార్క్మ్‌(్ర1)ను ఔట్‌ చేసి ఢిల్లీని పోటీలోకి తీసుకొచ్చాడు. మరోమారు బౌలింగ్‌కు వచ్చిన కుల్దీప్‌కు హెడ్‌ వికెట్‌ సమర్పించుకోవడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకోగా, భీకరమైన ఫామ్‌లో ఉన్న క్లాసెన్‌(15)ను అక్షర్‌ పటేల్‌ బౌల్డ్‌ చేశాడు. మిడిలార్డర్‌లో నితీశ్‌కుమార్‌, షాబాజ్‌ కీలక ఇన్నింగ్స్‌కు తెరతీశారు. ఢిల్లీ బౌలర్లపై అదే ఒత్తిడి కొనసాగిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ముఖ్యంగా షాబాజ్‌ కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ మార్క్‌ అందుకుని హైదరాబాద్‌ భారీ స్కోరుకు కారణమయ్యాడు.

ఫ్రేజర్‌, పంత్‌ పోరాడినా:

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీకి మెరుగైన శుభారంభం దక్కింది. ఓపెనర్‌ పృథ్వీషా (16)..వాషింగ్టన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మొదటి నాలుగు బంతులను బౌండరీలు కొట్టి ఢిల్లీకి ఊపుతీసుకొచ్చాడు. కానీ ఐదో బంతికి సమద్‌ క్యాచ్‌తో షా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో మెరుపులు మెరిపిస్తున్న జేక్‌ ఫ్రేజర్‌..హైదరాబాద్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. వార్నర్‌ (1) నిరాశపరిచినా..అభిషేక్‌తో కలిసి వరుస బౌండరీలతో అదరగొట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే ఫ్రేజర్‌ 50 పరుగుల మార్క్‌ అందుకున్నాడు. అయితే అభిషేక్‌, ఫ్రేజర్‌ వెంటవెంటనే ఔట్‌ కావడం ఢిల్లీ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. ఒక దశలో హైదరాబాద్‌తో ఢీ అంటే ఢీ అన్న ఢిల్లీకి మిడిలార్డర్‌ బ్యాటర్లు వైఫల్యం దెబ్బతీసింది. చివర్లో పంత్‌ పోరాడినా..లాభం లేకపోయింది. నటరాజన్‌..ఢిల్లీ పతనంలో కీలకమయ్యాడు.

  • టీ20క్రికెట్‌లో మూడుసార్లు 250కి పైగా చేసిన టీమ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో సర్రే(3), సోమర్‌సెట్‌, యార్క్‌షైర్‌, ఆర్సీబీ(2) ఉన్నాయి.

పవర్‌ప్లేలో అత్యధిక అర్ధసెంచరీలు

6-వార్నర్‌

3-క్రిస్‌ గేల్‌

3-సునీల్‌ నరైన్‌

3-ట్రావిస్‌ హెడ్‌

పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్లు

125/0-ఎస్‌ఆర్‌హెచ్‌X ఢిల్లీ

105/0-కేకేఆర్‌ X ఆర్సీబీ

100/2-చెన్నైX పంజాబ్‌

అత్యధిక సిక్స్‌లు

22-ఎస్‌ఆర్‌హెచ్‌X ఆర్సీబీ

22-ఎస్‌ఆర్‌హెచ్‌X ఢిల్లీ

21-ఆర్సీబీX పుణె

అత్యధిక టీమ్‌ స్కోర్లు

287/3-ఎస్‌ఆర్‌హెచ్‌X ఆర్సీబీ

277/3-ఎస్‌ఆర్‌హెచ్‌ X ముంబై

272/7-కేకేఆర్‌X ఢిల్లీ

10 ఓవర్లలో అత్యధిక స్కోరు

158/4-ఎస్‌ఆర్‌హెచ్‌ X ఢిల్లీ

148/2-ఎస్‌ఆర్‌హెచ్‌ X ముంబై

141/2-ముంబై X ఎస్‌ఆర్‌హెచ్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌సెంచరీ

16బంతుల్లో-అభిషేక్‌శర్మ-ముంబైపై

16బంతుల్లో-హెడ్‌-ఢిల్లీపై

18బంతుల్లో-హెడ్‌-ముంబైపై

సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్‌: 20 ఓవర్లలో 266/7 (హెడ్‌ 89, షాబాజ్‌ 59 నాటౌట్‌, కుల్దీప్‌యాదవ్‌ 4/55, అక్షర్‌ 1/29),

ఢిల్లీ: 19.1 ఓవర్లలో 199 ఆలౌట్‌(జేక్‌ ఫ్రేజర్‌ 65, పంత్‌ 44, నటరాజన్‌ 4/19, నితీశ్‌ 2/17)

2024-04-20T22:44:39Z dg43tfdfdgfd