‘అంపైరింగ్ తప్పిదాలతోనే ఆర్సీబీ ఓడింది’.. భగ్గుమంటోన్న బెంగళూరు ఫ్యాన్స్

ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. వరుసగా వికెట్లను చేజార్చుకున్నప్పటికీ.. చివరి వరకూ అద్భుతంగా పోరాడింది. అయితే ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లోనూ అదృష్టం ఆ జట్టును వెక్కిరించింది. అంపైరింగ్ తప్పిదాలు కూడా ఆర్సీబీ పాలిట శాపాలుగా మారాయని ఫ్యాన్స్ వాపోతున్నారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లి (7 బంతుల్లో 18) మెరుపు ఆరంభాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. కోల్‌కతా బౌలర్లపై ఎదురు దాడి మొదలుపెట్టిన కోహ్లి.. హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ బంతిని ఆడే క్రమంలో అతడికే క్యాచ్ ఇచ్చాడు. బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో నో బాల్ ఇస్తారని భావించారంతా. అయితే విరాట్ క్రీజ్ వదిలి బయటకురావడంతో అంపైర్ ఔటిచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఔట్ విషయం వివాదాస్పదమైంది.

విరాట్ ఔటైన మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ కళ్లు చెదిరే డైవ్ క్యాచ్‌తో డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు. ఓపెనర్లిద్దరూ త్వరగా ఔటైనప్పటికీ.. విల్ జాక్స్ (32 బంతుల్లో 55), రజత్ పాటిదార్ (23 బంతుల్లో 52) కోల్‌కతా బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో.. 11 ఓవర్లలో 137/2తో నిలిచిన ఆర్సీబీ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ తర్వాతి రెండు ఓవర్లలో మ్యాచ్ టర్న్ అయ్యింది.

ఇన్నింగ్స్ 12వ ఓవర్ బౌలింగ్‌కు దిగిన రస్సెల్.. తొలి బంతికే విల్ జాక్స్‌ను ఔట్ చేయడంతోపాటు.. అదే ఓవర్లో రజత్ పాటిదార్‌ను కూడా బుట్టలో వేసుకున్నాడు. తర్వాతి ఓవర్ బౌలింగ్ చేసిన సునీల్ నరైన్.. కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రార్‌ను ఔట్ చేశాడు. లోమ్రార్ కాట్ అండ్ బౌల్డ్ కాగా.. ఆ బంతిని వేసే సమయంలో నరైన్ ఓవర్ స్టెప్ వేశాడని.. అది నోబాల్ అయినా అంపైర్లు పట్టించుకోలేదని ఆర్సీబీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తున్నారు.

ఆర్సీబీ 16.4 ఓవర్లలో 182/6తో ఉన్న సమయంలో.. మరుసటి బంతికి సుయాష్ ప్రభుదేశాయ్ బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేపాడు. బంతి బౌండరీ లైన్‌కు కొంచెం లోపల పడిందని భావించిన అంపైర్ దాన్ని ఫోర్‌గా ఇచ్చాడు. అది సిక్స్‌ అయినప్పటికీ.. థర్డ్ అంపైర్‌ను సంప్రదించకుండానే అంపైర్ 4 ఇచ్చాడని.. అది సిక్స్ ఇచ్చుంటే ఫలితం మరోలా ఉండేదని ఆర్సీబీ ఫాలోవర్లు చెబుతున్నారు.

విరాట్ కోహ్లి ఔట్.. నరైన్ నో బాల్.. సుయాష్ సిక్స్ కొట్టినా ఫోర్ మాత్రమే ఇవ్వడం లాంటి అంపైరింగ్ తప్పిదాలతో తమ జట్టు ఓడిందంటూ సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన బెంగళూరు ప్లేఆఫ్స్‌పై ఆశలు వదులుకున్నట్టే..!

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-22T01:23:03Z dg43tfdfdgfd