టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన అంబటి రాయుడు.. ఆ స్టార్ ప్లేయర్లు లేకుండానే..!

మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక కోసం సెలక్టర్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే వికెట్ కీపర్ ఎంపిక విషయంలో ఓ క్లారిటీ రావాల్సి ఉంది. వికెట్ కీపర్ స్థానం కోసం ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పేస్ ఆల్‌రౌండర్ స్థానానికి ఎవర్ని ఎంపిక చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించాడు. స్టార్ స్పోర్ట్స్ కోసం రాయుడు ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న శివమ్ దూబేను రాయుడు ఎంపిక చేశాడు.

అంతే కాదు వికెట్ కీపర్ స్థానం కోసం పంత్, శాంసన్, రాహుల్ లాంటి ఆటగాళ్లను కాదని ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో డీకే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాళ్లను కూడా టీ20 వరల్డ్ కప్ కోసం రాయుడు పరిగణనలోకి తీసుకోలేదు.

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శతకంతో ఫామ్‌లోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌ను.. రోహిత్‌కు ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసిన అంబటి రాయుడు.. ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ మిడిలార్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను సైతం ఎంపిక చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన బౌలర్‌గా గుర్తింపు పొందిన లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మయాంక్ యాదవ్‌ను రాయుడు టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశాడు.

రాయుడు ప్రకటించిన జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, దినేశ్ కార్తీక్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.

సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లను కాదని ఐపీఎల్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు బాగా ఆడిన దినేశ్ కార్తీక్, మయాంక్ యాదవ్‌‌లను ఎంపిక చేయడం ఏంటని నెటిజన్లు రాయుణ్ని ప్రశ్నిస్తున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన ఇర్ఫాన్ పఠాన్.. శివమ్ దూబేతోపాటు హార్దిక్ పాండ్యను సైతం ఎంపిక చేశాడు.

14వ ఆటగాడిగా చాహల్ లేదా రవి బిష్ణోయ్, 15వ ఆటగాడిగా గిల్/శాంసన్‌లను ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేశాడు. వీరితోపాటు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌ను రిజర్వ్ ప్లేయర్లుగా పంపించాలని సూచించాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T08:16:28Z dg43tfdfdgfd