నీ వల్లే ఓడాం.. దీపక్ చాహర్‌పై మండిపడుతోన్న చెన్నై ఫ్యాన్స్.. ధోనీ ఆగ్రహం..!

ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. ఏప్రిల్ 19 లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే చేధించిన రాహుల్ సేన.. మంగళవారం రాత్రి చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 211 పరుగుల లక్ష్యాన్ని సైతం చేధించింది. చెన్నైపై సాధించిన విజయాలతో లక్నో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానానికి చేరుకోగా.. సూపర్ కింగ్స్ ఐదో స్థానానికి పడిపోయింది.

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 210 పరుగులు చేసినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. సొంత మైదానమైన చెపాక్‌లో సీఎస్కేకి ఈ సీజన్లో ఇది తొలి ఓటమి కావడం గమనార్హం. లక్నోతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ తప్పిదాలు చెన్నై ఓటమికి కారణాలయ్యాయి. ముఖ్యంగా దీపక్ చాహర్ తేలిగ్గా ఆపాల్సిన బౌండరీలను వదిలేయడం సీఎస్కేకి ప్రతికూలంగా మారగా.. లక్నోకు కలిసొచ్చింది.

శార్దుల్ థాకూర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో పూరన్ వరుసగా 6, 4, 6 కొట్టాడు. అయితే ఫోర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ దగ్గరున్న దీపక్ చాహర్ తేలిగ్గా అడ్డుకోవాల్సింది. కానీ చాహర్ తప్పిదంతో బంతి బౌండరీ లైన్ దాటింది. దీంతో ధోనీ డిజప్పాయింట్ అయ్యాడు.

ఇన్నింగ్స్ 18.3వ ఓవర్లోనూ దీపక్ చాహర్ మరో బంతిని వదిలేయడంతో అది కాస్తా బౌండరీ లైన్ దాటి వెళ్లింది. ఈసారి బంతి చాహర్ చేతి వేళ్లను తాకుతూ బౌండరీ రోప్‌ను దాటేసింది. చాహర్ ఫీల్డింగ్ తప్పిదాలు చేయకపోయి ఉండుంటే.. ఆఖరి ఓవర్లో లక్నో ముంగిట 21 పరుగులకుపైగా లక్ష్యం ఉండేదని.. అప్పుడు తమ జట్టు గెలిచే అవకాశం ఉండేదని చెన్నై ఫ్యాన్స్ చెబుతున్నారు. అందుకే చాహర్ ఫీల్డింగ్ తప్పిదాల వల్లే ఓడామంటూ సీఎస్కే పేసర్‌పై మండిపడుతున్నారు.

తేలికగా ఆపాల్సిన బంతులను వదిలేసిన దీపక్ చాహర్ పట్ల ధోనీ ఆగ్రహంతో కనిపించాడు. కానీ అతణ్ని మాత్రం ఏమీ అనలేదు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో చాహర్‌కు ధోనీ చివాట్లు పెట్టాలని చెన్నై ఫ్యాన్స్ సూచిస్తున్నారు. గతంలో చాహర్‌పై మైదానంలోనే మహీ ఆగ్రహం వ్యక్తం చేసిన ఫొటోను పోస్టు చేస్తున్నారు.

రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్), శివమ్ దూబే (27 బంతుల్లో 66) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అయితే జడేజా పది బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయడంతో.. అతడిపైనా చెన్నై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

211 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్), నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్) రాణించడంతో లక్నో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T03:45:11Z dg43tfdfdgfd