విరాట్ కోహ్లీ ఔటా? నాటౌటా? క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. సరిగ్గా 20 ఓవర్లలో 221 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచుల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

అయితే ఈ మ్యాచులో ఆర్సీబీ ఛేజింగ్ సందర్భంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు. తన ఔట్ విషయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్‌‌తో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?

ఆర్సీబీ ఛేజ్ సందర్భంగా మూడో ఓవర్ వేసేందుకు హర్షిత్ రాణా సిద్ధమయ్యాడు. తొలి బంతికే కోహ్లీ ఔట్ అయ్యాడు. అప్పటికే 2 సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి జోష్ మీద ఉన్న కోహ్లీ.. క్రీజ్ బయటకొచ్చి ఆడాడు. హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ బంతిని విరాట్ అంచనా వేయలేకపోయాడు. దీంతో అతడి బ్యాటుకు తగిలిన బంతి అక్కడే గాల్లోకి లేవగా.. హర్షిత్ క్యాచ్ అందుకున్నాడు. కానీ ఆ బంతి తనకు నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. నాటౌట్ అని కోహ్లీ రివ్యూ కోరేందుకు సిద్ధమ్యయాడు. కానీ ఫీల్డ్ అంపైర్లే థర్డ్ అంపైర్ రివ్యూ తీసుకున్నారు. రిప్లేలో చూసిన తర్వాత కోహ్లీ క్రీజ్ బయట ఉన్నట్లు తేలింది. దీంతో టీవీ అంపైర్ కోహ్లీని ఔట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన విరాట్.. కోపంతో పెవిలియన్ చేరాడు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఎంసీసీ రూల్స్ ప్రకారం నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే బంతుల విషయంలో రూల్ 41.7.1లో స్పష్టంగా ఉంది. ఫుల్ టాస్‌గా వచ్చిన బంతి క్రీజులో నిలబడి ఉన్న బ్యాటర్‌కు నడుం కంటే ఎక్కువ ఎత్తులో వస్తే.. అది నోబాల్‌గా పరిగణిస్తారు. దీంతో ఈ విషయంపై విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్ తర్వాత కూడా అంపైర్లతో మాట్లాడాడు.

కోహ్లీ ఎలా ఔట్..?

ఎంసీసీ రూల్ ప్రకారం క్రీజ్‌లో ఉన్న బ్యాటర్‌కు నడుం కంటే ఎక్కువ ఎత్తులో వచ్చే ఫుల్ టాస్ బంతిని నోబాల్‌గా ఇస్తారు. కానీ కోహ్లీ క్రీజు బయట ఉన్నట్లు క్లియర్‌గా కనిపించింది. అంతేకాకుండా ఆ బంతి స్లోగా రావడంతో క్రీజు వద్దకు వెళ్లే సరికి ఎత్తు తగ్గింది. విరాట్ కోహ్లీ నడుం హైట్ 1.04 మీటర్లు కాగా.. బంతి క్రీజ్ వద్దకు వెళ్లేటప్పటికి 0.92 మీటర్ల ఎత్తులో ఉంటుందని ట్రాకర్ తేల్చింది. ఒకవేళ కోహ్లీ క్రీజులోనే ఉండి ఉంటే.. ఆ బంతి నడుం కంటే కిందకు వచ్చేది. దీంతో అపైర్లు కోహ్లీని ఔట్ అని ప్రకటించారు.

ఏది ఏమైనా కోహ్లీ ఔట్ కావడంతో ఆర్సీబీని ఓడిపోయేలా చేసింది! అతడు ఇంకొంచెం సేపు క్రీజ్‌లో ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవని.. ఆర్సీబీ గెలిచేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-22T03:23:16Z dg43tfdfdgfd