CSK: రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీ.. ధోనీ రికార్డు బ్రేక్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో మరో సెంచరీ నమోదైంది. చెన్నైలోని చెపాక్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఈ ఫీట్‌ సాధించాడు. మ్యాచ్‌ ప్రారంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సీఎస్కే కెప్టెన్.. 56 బంతుల్లోనే మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే తొలి ఓవర్‌లోనే అజింక్య రహానే (1)ను పెవిలియన్‌ చేర్చింది. కాసేపటికే డేరిల్‌ మిచెల్‌ (11) సైతం త్వరగానే ఔట్‌ అయ్యాడు. ఈ దశలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. రవీంద్ర జడేజా (16) పరుగులకే ఔట్‌ అయినా.. శివమ్‌ దూబె చక్కటి సహకారం అందించాడు.

ఈ క్రమంలో 56 బంతుల్లోనే రుతురాజ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 60 బంతుల్లో 108 రన్స్‌ స్కోర్‌ చేశాడు. శివమ్‌ దూబె తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 27 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్ 200 పరుగుల మార్కును అందుకుంది. చివర్లో వచ్చిన ధోనీ.. ఒకే బంతిని ఎదుర్కొని ఫోర్‌ కొట్టాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, మోసీన్ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

ఇదిలా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా సెంచరీ సాధించిన ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్ రికార్డు నెలకొల్పాడు. రుతురాజ్ కంటే ముందు చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఎమ్మెస్ ధోనీ.. కెప్టెన్‌గా చేసిన అత్యధిక పరుగులు 84. తాజాగా రుతురాజ్ గైక్వాడ్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T16:43:40Z dg43tfdfdgfd