IPL: పంజాబ్ కొత్త రికార్డు.. టీ20 చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్, సిక్స్‌ల రికార్డు

ఈడెన్ గార్డెన్స్ సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. జానీ బెయిర్‌స్టో పవర్‌ఫుల్ సెంచరీతో భారీ స్కోరును అలవోకగా ఛేదించింది. బౌండరీలతో విరుచుకుపడ్డ బెయిర్‌స్టో కేవలం 48 బంతుల్లో 108 పరుగులు (9 సిక్స్‌లు, 8 ఫోర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు చివర్లో శశాంక్ సింగ్ చెలరేగి ఆడాడు. దీంతో కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే భారీ రన్ ఛేజ్ రికార్డు నమోదు చేసింది. 24 సిక్సర్లలో సిక్సర్ల ప్రపంచ రికార్డు నెలకొల్పింది పంజాబ్ కింగ్స్. కేకేఆర్ బ్యాటర్లు 18 సిక్స్‌లు బాదడంతో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ నిలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ (54 పరుగులు, 20 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో కలిసి జానీ బెయిర్‌స్టో గట్టి పునాది వేశాడు.

ప్రభ్‌సిమ్రన్ సింగ్ రనౌట్‌గా వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్కో 26 పరుగులు (16 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్‌లు) చేశాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ (68 పరుగులు, 28 బంతుల్లో, 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బెయిర్‌స్టోతో కలిసి లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 18.4 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యం ఛేదించింది.

పంజాబ్ కింగ్స్ బ్యాటర్ల దాటికి కేకేఆర్ బౌలర్లందరూ తేలిపోయారు. సునీల్ నరైన్ మాత్రమే కాస్త ప్రభావం చూపగలిగాడు. 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చిన నరైన్ 1 వికెట్ పడగొట్టాడు.

విరుచుకుపడ్డ కేకేఆర్ ఓపెనర్లు

పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ సారథి శిఖర్‌ ధావన్‌ గైర్హాజరీతో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్‌ కరన్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (75 పరుగులు, 37 బంతుల్లో, 6 సిక్స్‌లు, 6 ఫోర్లు), సునీల్‌ నరైన్ (71 పరుగులు, 32 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు సాధించడంతో 10.2 ఓవర్లలోనే కేకేఆర్ 138 పరుగులు చేసింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్ 24 పరుగులు (12 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. అనంతరం వెంకటేష్ అయ్యర్ (39 పరుగులు, 23 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (28 పరుగులు, 10 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో కేకేఆర్ భారీ స్కోరు చేసింది.

చివర్లో రింకూ సింగ్ 5, రమణ్‌దీప్‌ సింగ్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేకేఆర్ 261 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చాహర్ 1 వికెట్ తీశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T18:25:32Z dg43tfdfdgfd