ఆర్సీబీ ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరొచ్చు ఇలా.. బెంగళూరు మరింత డేంజరస్ ఇప్పుడు..!!

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు జరిగిన డబ్ల్యూపీఎల్‌ లీగ్‌లో ఆర్సీబీ మహిళల జట్టు టైటిల్ సాధించింది. దీంతో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టు సైతం కప్పు కొడుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్ భావించారు. కానీ సీజన్ సగం ముగిసే సరికి.. ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. ఇప్పటికే 8 మ్యాచ్‌లు ఆడేసిన ఆర్సీబీ కేవలం రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కోల్‌కతా చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన తర్వాత.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే టెక్నికల్‌గా ఇప్పటికీ ఆ జట్టు తదుపరి దశకు చేరుకోగలదు.

బెంగళూరు ఇంకా ఆరు మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉండగా.. ప్లేఆఫ్స్ చేరాలంటే, అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలిచి తీరాలి. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 14 పాయింట్లు చేరతాయి. ప్రస్తుతం ఆ జట్టు నెట్ రన్ రేట్ - 1.046గా ఉంది. దీంతో నెట్ రన్ రేట్ మెరుగుపర్చుకోవడం కోసం ప్రత్యర్థులపై భారీ తేడాతో ఆ జట్టు విజయాలు సాధించాల్సి ఉంటుంది. అయినా సరే ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఇతర జట్ల ఫలితాలపైనా ఆర్సీబీ ఆధారపడాల్సి ఉంటుంది. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో ఓడినా సరే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు గల్లంతవుతాయి. ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

ఆర్సబీ తన తదుపరి మ్యాచ్‌లో బలమైన సన్‌రైజర్స్‌ను ఎదుర్కోనుంది. అది కూడా దాని సొంత మైదానం ఉప్పల్‌లో. ఏప్రిల్ 25న జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక వేళ ఓడితే మాత్రం అస్సామే. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్‌తో రెండుసార్లు తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ కూడా బెంగళూరు కంటే బలంగానే కనిపిస్తోంది. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో పంజాబ్, ఢిల్లీ, చెన్నైలతో బెంగళూరు తలపడాల్సి ఉంటుంది. పంజాబ్, ఢిల్లీలపై గెలవొచ్చు కానీ.. సీఎస్కేతో మ్యా్చ్‌లో గెలవాలంటే మాత్రం ఆర్సీబీ పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఐపీఎల్‌లో అత్యంత బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఒకటైన ఆర్సీబీకి ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానుల మద్దతు ఎంతో అవసరం. మే 4న గుజరాత్ టైటాన్స్‌తో, మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ తమ జట్టుకు పూర్తిగా మద్దతునిస్తారనడంలో సందేహం లేదు. ఒకవేళ మధ్యలోనే ఏదైనా ఒక మ్యాచ్‌లో ఓడితే మాత్రం.. ఆర్సీబీ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఓడినా గెలిచినా పోయేదేమీ లేదనప్పుడు.. ఏ జట్టయినా సరే మరింత స్వేచ్ఛగా ఆడగలదు. అలాంటప్పుడు తనతోపాటు మరికొన్ని జట్లను ఆర్సీబీ ఇంటి ముఖం పట్టించగలదు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-22T02:23:10Z dg43tfdfdgfd